Tirumala Laddu Case: తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక అందించింది. రెండు రోజుల క్రితం సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు ఈ నివేదికను సిట్ అధికారులు అందించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కేసు దర్యాప్తు పురోగతి, ఇప్పటివరకు దర్యాప్తులో తేలిన విషయాలతో నివేదిక అందించారని సమాaచారం. అయితే, ఈ కేసు దర్యాప్తు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు దర్యాప్తులో బయటపడిన అంశాలు, స్థానిక కోర్టు నుండి హైకోర్టు వరకు కూడా నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు, వాటిపైన జరుగుతున్న విచారణ, వాటి పురోగతి తదితర అంశాలను నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.కాగా, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో నిజానిజాలను తేల్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ఒక్క టీటీడీకే కాకుండా.. ఇతర దేవాలయాలకు కూడా నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. టీటీడీ నుంచే నిందితులు దాదాపు 240 కోట్ల వరకు లబ్ది పొందారని వార్తలు వినిపించాయి. నకిలీ నెయ్యి తయారీ, సరఫరాలో భోలేబాబా డైరీదే కీలక పాత్ర అని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వ్యాఖ్యానించండి