నేహారెడ్డి కంపెనీపై చర్యలకు అంత నిర్లక్ష్యమా?
విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాలు జరిపిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి కంపెనీపై క్రిమినల్ చర్యలువిశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాలు జరిపిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి కంపెనీపై క్రిమినల్ చర్యలు ప్రారంభించడంలో నిర్లక్ష్యం చూపిన ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) మెంబర్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతీ లేదని మండిపడింది. క్రిమినల్ చర్యలు ప్రారంభించే విషయంలో మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన ఫిర్యాదు రిటర్న్ అయినప్పటికీ, తిరిగి దానిని దాఖలు చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి తమ ఉత్తర్వులు అమలు చేయకుంటే ఆన్‌లైన్ ద్వారా తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అవసరమైతే ఏపీసీజెడ్‌ఎంఏ మెంబర్ సెక్రటరీని తొలగింపునకు ఆదేశాలిస్తామని హెచ్చరించింది. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.అడ్డగోలుగా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నా కళ్లు మూసుకున్న అప్పటి జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల పేర్లను తమ ముందు ఉంచాలని ఏపీసీజెడ్‌ఎంఏ మెంబర్ సెక్రటరీ, జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. మరోవైపు తీర ప్రాంతంలో అనుమతులకు భిన్నంగా రెస్టోబార్లు నిర్మించినట్లు సర్వేలో అధికారులు గుర్తించారని పేర్కొంది. సంబంధిత రెస్టోబార్ల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారి నుంచి వివరణ తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరై వాదనలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని 6 వారాల్లో పూర్తి చేయాలని, తదుపరి విచారణలో వివరాలను కోర్టు ముందు ఉంచాలని అధికారులను ఆదేశించింది. సముద్రానికి అతిసమీపంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ అవ్యాన్ రియల్టర్స్ ఎల్‌ఎల్‌పీ శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్ పీఎల్‌వీఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నాలుగు రెస్టోబార్లను తొలగించడంతో పాటు సహజ ఆవాసాలను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గ్రామాభివృద్ధిసేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం నేహారెడ్డి కంపెనీపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని ఏపీసీజెడ్‌ఎంఏ మెంబర్ సెక్రటరీని ఆదేశించింది.
వ్యాఖ్యానించండి