మున్సిపల్ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారు?
రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారు..ఎందుకు ఆలస్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు తెలుసుకొని తమ ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 25న నిర్మల్‌ మున్సిపాలిటీ పాలకవర్గ కాలపరిమితి ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ నిర్మల్‌ నటరాజ్‌నగర్‌కు చెందిన రాజేందర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీ.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. సర్కార్, ఎస్‌ఈసీ తీరు చట్టవిరుద్ధమని, రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 243 యూ, 243 జెడ్‌ఏలను ఉల్లంఘించేదిగా ఉందన్నారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019లోని నిబంధనలను ప్రభుత్వం పాటించకపోవడం, మూడు నెలలు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఎలా ఆదేశాలిస్తామని న్యాయమూర్తి ప్రశ్నించారు.
కేంద్ర ఎన్నికల కమిషన్‌ పాత్ర ఉంటుందా అని అడిగారు. ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎస్‌సీఐ పాత్ర ఉండదన్నారు. వార్డుల రిజర్వేషన్లు సహా అన్ని అంశాలు పూర్తి చేసిన తర్వాతే కమిషన్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తుందని చెప్పారు. దీనిపై ఏజీపీ సౌమ్య స్పందిస్తూ.. సర్కార్‌ నుంచి సూచనలు తీసుకొని చెప్పేందుకు రెండు వారాలు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి.. విచారణను వాయిదా వేస్తూ, ఆ లోగా వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి, నిర్మల్‌ కలెక్టర్, కమిషనర్, ఎస్‌ఈసీలకు నోటీసులు జారీ చేశారు.
వ్యాఖ్యానించండి